అన్నభేధి : అన్నభేధితో విషదోషములు మాయం

అన్నభేధి : సంస్కృతంలో పిలువబడే అన్నభేధి ని ఆంగ్లములో Sulphate of Iron అని పిలుస్తారు. ఆకుపచ్చ,   నలుపు, తెలుపు అను ఈ మూడు రంగులును కలిసిన రంగు కలిగి గడ్డగడ్డలుగా ఉంటుంది. ఇది ఖనిజ పదార్ధము. ఇది రెండు విధములు. పుష్ప కాసీసము, ధాతుకాసీసము అని పిలుస్తారు. వీటిలో పుష్ప కాసీసము శ్రేష్ఠమైనది.

అన్నభేధి గుణములు :

  • ఉప్పు, పులుపు, వగరు, అనే ఈ మూడు రుచులు దీనియందు కలవు.
  • వేడిచేసే గుణము కలిగినది.
  • విపాకమున పులుపురుచిగా మారుతుంది.
  • చక్కగ విరేచనము అవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
  • వాత, కఫములను హరిస్తుంది.
  • విష దోషములను పోగొడుతుంది.
  • బొల్లి వ్యాధిని పోగొడుతుంది.
  • కంటి జబ్బులకు చాలా హితకరమైనది.
  • ఋతుబద్ధమును హరించును.
  • తలవెంట్రుకలు నల్లబడుటలో దీనికి అనేక ఉపయోగములు  కలవు.
  • రసాయనద్రవములలో ఇది ఒకటి.

అన్నభేధి ఔషధములు

అన్నభేధి ని నిమ్మరసముతో గాని, గుంటకలగరాకు రసముతో గాని భావనచేసినట్లయితే శుద్ధి అవుతుంది. ఇలా శుద్ధి చేసిన అన్నభేధిని నిమ్మరసముతో నూరి బిళ్ళల్లా చేసి ఆరనిచ్చి పుటము వేసినట్లయితే ఎర్రని రంగుతో భస్మమవుతుంది. గంధక కాసీనములు రెండును కలిపి నూరి పుటము వేసినట్లయితే దానికి కాంత కాసీనమనే పేరుతో భస్మము తయారవుతుంది. ఈ భస్మము అజీర్ణములకు, ఉబ్బురోగములకు ప్రధానమైన మందు. దీనిని సేవించినట్లయితే సన్ని రోగములు నివారింపబడతాయి.

అన్నభేధి  ఋతుబద్ధమునకు 

అన్నభేధి భస్మము, ముసాంబ్రము, ఇంగువ, వెలిగారము సమభాగములుగా కలిపి కలబంద రసముతో మర్దించి కందిగింజలంత మాత్రలు చేసి, ఉదయము, సాయంత్రము సేవించినట్లయితే ఋతువు జారీ అవుతుంది.

అన్నభేధి దారుణమైన ఉబ్బులకు

అన్నభేధి ని గుంటకలగరాకు రసముతో భావనచేసి, గాడిదిగటపాకు రసముతో నూరి పుటము వేసిన భస్మము నాలుగు గురివిందగింజల ఎత్తు ఉసిరి రసముతో కలిపి రెండు పూటలా ఇచ్చినట్లయితే దారుణమైన, అసాధ్యములైన ఉబ్బులు కూడా నశించును. మిక్కిలి అనుభవసిద్ధమైన యోగము. వారము రోజులకు ఉబ్బంతా తీసిపోవును. ఈ మందు సేవించునప్పుడు చప్పిడి పత్యము చేయవలెను. పచ్చి ఉసిరికాయలు దొఱకని రోజులలో ఉసిరిక పప్పు రసంతో సేవించవలెను.

అన్నభేధి కుళ్ళిన కురుపులకు

కాసీసపు నీళ్ళలో తెల్లగుగ్గిలము, త్రిఫలచూర్ణము, కవిరిచూర్ణము, పసుపు కలిపి ఆ కషాయముతో వ్రణములు నిత్యము కడిగి గుగ్గిలముపొగ వేస్తూ ఉంటే వ్రణములు మానుపడతాయి. ఈ కషాయము కురుపులు గాని, దెబ్బలు గాని కడుగుటకు చాలా మంచిది. కాసీసములో లోహము కలదు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Similar Posts